Display:
అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-6
సంపుటము: 1-512
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
[1]ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు
॥ఏకతాన॥
మంచిమంచి పన్నీట మజ్జన మవధరించి
పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు
అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని
కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను
॥ఏకతాన॥
తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని
తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు
గుట్టుతోడ సొమ్ములెల్లా(ఁ?) గుచ్చికుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను
॥ఏకతాన॥
తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు
మునుకొని యారగించి మూఁడులోకములు మెచ్చ
చనవరి సతులలో సరసమాడుతాను
॥ఏకతాన॥

[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము