Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 101-4
సంపుటము: 2-4
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
దైవమా నీమాయ తలమొ లెఱఁగనీదు
కావరపు విషయాల కట్లు వదలవు
॥పల్లవి॥
గక్కునఁ బెరిగివచ్చీ కాలము మీఁదమీఁద
వొక్కనాఁటి కొక్కనాఁటి కొత్తుకొత్తుక
నిక్కి తుమ్మిదలవంటి నెరులెల్లాఁ దెల్లనాయ
కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు
॥దైవ॥
చిన్ననాఁడు మోహించిన చెలులు నేఁ జూడఁగానే
పన్నిన వయసు మీరి ప్రౌఢలైరి
వన్నెకుఁ బెట్టిన సొమ్ము వడి రాసి యెత్తుదీసె
మున్నిటివే వెనకాయ ముచ్చటాఁ దొలఁగదు
॥దైవ॥
సిగ్గులెల్లాఁ బెడఁబాసె చేరి యవ్వరు నవ్వినా
యెగ్గుపట్టదు మనసు యెఱుకతోనే
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు నన్ను నేలుకొని
దగ్గరి నాలోనుండఁగా తలపూఁ గైవాలదు
॥దైవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము