అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-4
సంపుటము: 1-52
రేకు: 8-4
సంపుటము: 1-52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
చాలదా హరినామసౌఖ్యామృతము దమకు చాలదా హితవైన చవులెల్ల నొసఁగ | ॥చాలదా॥ |
ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా చెదరకీ జన్మముల చెఱలు విడిపించ మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా పదివేలు నరకకూపముల వెడలించ | ॥చాలదా॥ |
కలదొకటి హరినామకనకాద్రి చాలదా తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ తెలివొకటి హరినామదీపమది చాలదా [1]కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల | ॥చాలదా॥ |
తగు వేంకటేశు కీర్తన మొకటి చాలదా జగములో కల్పభూజంబువలె నుండ సొగిసి యీ విభుని దాసుల కరుణ చాలదా నగవుఁ జూపులను నున్నతమెపుడుఁ జూప | ॥చాలదా॥ |
[1] ‘కలుషంపు గతిన చిప్పగురులో గటిక?’ అని పూ.ము.పా. ‘కఠినచీఁకటి’కి ‘కటికచీఁకటి’ అను సవరింపు మంచిదే. కఠినచీఁకటివంటి విరుద్ధసమాసములు వింతపదప్రయోగములు ఈ వాఙ్మయమునకు క్రొత్తలు కావు.