Display:
శృంగార సంకీర్తన
రేకు: 502-1
సంపుటము: 13-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
ఇన్నాళ్ళదాఁకాను యెడమాటలు జరగె
పన్నిన నా భాగ్యము ప్రత్యక్షమాయనే
॥పల్లవి॥
పచ్చిదేరే మేనితోడి పాయపువిభునిఁ గంటి
దిచ్చరి పనులన్నియుఁ దేరీ నేఁడు
రచ్చలో తగవు దిద్ద రామలందరు నున్నారు
తచ్చివేసినట్టు నాతలఁపు లీడేరెనే
॥॥
వేడుకకాఁడై వచ్చి విభుఁడిదె మాటలాడె
నీడల నేఁ గోరినట్టే నిలిచె నేఁడు
కూడిన బాసలకును గుఱి మరుఁడున్నాఁడు
జాడ దప్పకుండాను నిజములేరుపడెనే
॥॥
తానె శ్రీ వేంకటేశుఁడు తగ నన్నుఁ గాఁగిలించె
తానకమై మోహములు దాకొనె నేఁడు
పూనిన వొడఁబాటుకు వుంగరమిదె వున్నది
కానుకలై సలిగెలు కైవములాయనే
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము