Display:
శృంగార సంకీర్తన
రేకు: 514-5
సంపుటము: 13-81
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏఁటికిఁ బదరే వింతులతోడను
నేఁటనె తప్పదు నేరుపు భువిని
॥పల్లవి॥
వలవ నేరుతువు వడి నీ రమణుని
వలపించఁగ నేరవలెఁ గదవే
పలికినటులనే పంతము పైపై
నిలిపినదే పో నేరుపు భువిని
॥ఏఁటి॥
నవ్వ నేరుతువు ననుపున నాతని
నవ్వించవలెఁగదే నటనలను
వువ్విళ్ళవలె నోరూరించి పగటుల
నివ్వటిలుట పో నేరుపు భువిని
॥ఏఁటి॥
చిక్క నేరుతువు శ్రీవేంకటేశ్వరుఁ
జిక్కించవలెఁగదే సేవలను
మక్కువ నీ వలమేల్మంగ వెనసితివి
నిక్కి మమ్మేలుట నేరుపు భువిని
॥ఏఁటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము