శృంగార సంకీర్తన
రేకు: 517-5
సంపుటము: 13-99
రేకు: 517-5
సంపుటము: 13-99
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎట్టోరువవచ్చు యిటువంటివెల్లఁ జూచి పట్టపగటనుండియు బడలె నీచెలియ | ॥పల్లవి॥ |
పంతగాఁడవైనందుకు బలిమి గలయందుకు నింతులతోఁ జూపేవా యెగసక్కేలు యెంతదడవాకుమడిచిప్పించుకొనేవు నీవు బంతినిట్టే నిలుచుండి బడలె నీచెలియ | ॥ఎటోప॥ |
నేరుపరివైనందుకు నిజముగల యందుకు ఆరీతిఁ దక్కింతురా యంగనలను కోరి తొడలపైఁ జాఁచుకొంటివి నీపాదాలు భారము మోచుకవుండి బడలె నీచెలియ | ॥ఎటోప॥ |
యేలినందుకు శ్రీవేంకటేశుఁడవైనందుకు జాలిఁబెట్టుదురా యింత సకియలను వేళతోఁ గాఁగిటఁ గూడి వెలయ మన్నించితివి ఆలరి రతులచేత నలసె నీచెలియ | ॥ఎటోప॥ |