Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-6
సంపుటము: 1-54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
నీ కథామృతము నిరత సేవన నాకు
చేకొనుట సకలసంసేవనం బటుగాన
॥నీ కథా॥
ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు
నిదియె వేదసంహితపాఠము
యిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు
నిదియె సంధ్య నా కిదియ జప మటుగాన
॥నీ కథా॥
యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు
నిదియె దుఃఖవిరహితమార్గము
యిదియె భవరోగహితభేషజము నాకు
నిదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన
॥నీ కథా॥
యిదియె దానఫల మీఁజాలినది నాకు
యిదియే తలఁపఁ బరహితకర్మము
యిదియె తిరువేంకటేశ నీసంస్మరణ
మిదియె యిదియె ఇన్నియును నటుగాన
॥నీ కథా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము