Display:
శృంగార సంకీర్తన
రేకు: 520-4
సంపుటము: 13-116
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీవే మన్నించేవు గాక నీచిత్తము వచ్చితేను
కావరించి నే నిన్ను కాఁతాళము రేఁతునా
॥పల్లవి॥
సంగడి సతులు నిన్ను చన్నులు నొత్తిరంటాను
జంగిలిలో నే నిన్ను చండి సేతునా
అంగడివారెల్లా నిన్ను నంటఁ గాఁగిలించిరంటా
వుంగిటిగా నే నిన్ను నొత్తుకోలు సేతునా
॥నీవే॥
వుద్దండవు సతులెల్ల వొడివట్టి తీసిరంటా
కొద్దిమీర నే నీపై గోరు దీతునా
గద్దరి చెలులు నిన్ను ఘాతలెల్లాఁ జేసిరంటా
అద్దుకొని నే నిన్ను నాఱడిగాఁ జేతునా
॥నీవే॥
ఆగడపు కాంతలు నిన్నలమి కూడిరంటా
వేగిరించి నే నిన్ను వేసరింతునా
యీగతి శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
చేగ దేర నే నిన్ను చిమ్మి రేఁతునా
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము