అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-1
సంపుటము: 1-55
రేకు: 9-1
సంపుటము: 1-55
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
[1]ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదు తాముసేసినంత [2]వట్టు తమకుఁ బోరాదు | ॥ఏమి॥ |
ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపు బట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదు తట్టువడ లోకమెల్ల [3]దవ్వుకొనినా లేదు తెట్టఁదెరువున నోరు దెరచినా లేదు | ॥ఏమి॥ |
అడిగి పరుల బదు కాసపడ్డా లేదు, భీతి విడిచి నెత్తుటఁ దోగి వీరుఁడైనా లేదు అడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదు యిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు | ॥ఏమి॥ |
వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు మెచ్చుల గుఱ్ఱము నెక్కి మెరసినా లేదు యెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటే యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు | ॥ఏమి॥ |
[1] ఇందు దశావతార సమన్వయము కలదు.
[2] వట్టుఁ దమకు అని పూ.ము.పా.
[3] ‘దప్పు’ అని పూ.ము.పా.