Display:
శృంగార సంకీర్తన
రేకు: 567-3
సంపుటము: 13-337
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఆతడు బత్తిగలఁడు అన్నిటా నీపై నిదే
నీతితోడ నుండవే నీకే మేలు
॥పల్లవి॥
వేసరుకొనకువే విభుఁడు దానే వచ్చీ
ఆసపడి వుండవే అన్నియు లెస్సయ్యీనీ
వాసిఁ బంతాలాడకువే వలపులు చవులయ్యీ
బాసలు దలఁచుకోవే పట్టమేలేవు
॥॥
యెగ్గులు వట్టకువే యీతఁడే నిన్ను మన్నించీ
సిగ్గులు వడకువే చింత దీరీని
వెగ్గళపు జంకెలేలే వేడుక దానే పుట్టీ
వొగ్గి కాచుకుండవే వుర మెక్కేవు
॥॥
సేవలింకాఁ జేయవే శ్రీవేంకటేశుఁడు గూడీ
వావులు చెప్పితి వౌనే వన్నేలుగాను
భావములోఁ గొంకకువే పచ్చి దేరీఁ దమకము
దేవులవై మెరయవే దిష్టమయ్యీ భోగము
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము