Display:
శృంగార సంకీర్తన
రేకు: 567-4
సంపుటము: 13-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏమి సేతు నీచిత్త మెటువలె నుండునో
ఆమాటకే లోఁగితి నన్నాదరించవయ్యా
॥పల్లవి॥
చాలుకొని నీతోను సరసములాడఁగాను
ఆలించి మందెమేళ మనవుగదా
నాలి సేయకప్పటిని నవ్వులెల్ల నవ్వఁగాను
ఆలరి యాఁటది యని ఆడికెలు సేతువో
॥॥
వొడిగట్టుకొని నీకు వూడిగేలు సేయఁగాను
అడరి యిచ్చకురాల ననవు గదా
తడబడ వీడేలు దండనుండి ఇయ్యఁగాను
కొడిమలు గట్టి కొంత కొసరుదువో
॥॥
పానుపు మీద నుండి భావములు గరఁచఁగా
ఆనుకొని గయ్యాళి ననవు గదా
పూనుక శ్రీవేంకటేశ పొంచి నన్ను గూడితివి
యీ నెపాన నన్ను నిట్టె యేలుదువో
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము