Display:
శృంగార సంకీర్తన
రేకు: 602-1
సంపుటము: 14-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సోమరాగం
ఊరకుండుమనవే వొడఁబాటులిఁక నేలే
కోరికలు గోరుకొంటా గొణఁగేఁ గాని
॥పల్లవి॥
అగపడితిమి తొల్లే ఆయను తన పొందు
యెగసక్కేలాడక తానిఁక నెన్నఁడే
జగడించ నోపము జవ్వనము మోచుకొని
మొగము చూచి చూచి మూలిగేఁ గాని
॥ఊర॥
సేవలెల్లాఁ జేసేము చెల్లుబడి గలవాఁడు
యీవల నవ్వులు నవ్వకిఁక నెన్నఁడే
చేవట్టి తియ్యనేల సిగ్గులు పై వేసుకొని
దేవరంటా మొక్కుకొంటా దీవించేఁ గాక
॥ఊర॥
కూడితిమి కాఁగిటను గురుతు చన్నులనంటె
యీడనే ప్రియాలు సేయకిఁక నెన్నఁడే
జోడై శ్రీ వేంకటేశ చుట్టరికపుఁదనాన
మేడెపు రతులలోన మెచ్చేము గాక
॥ఊర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము