Display:
శృంగార సంకీర్తన
రేకు: 609-4
సంపుటము: 14-52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
వేగిరింతురటే నీవు విభునితోను
చేగదేర నీ చేతికిఁ జిక్కుదాఁకాను
॥పల్లవి॥
ఆడినట్టె ఆడవే ఆతనితోను
వాడికె నీకైవశమై వచ్చుదాఁకాను
కూడినట్టె కూడవే కోమలి నీవు
జోడయి నీరతులను చొక్కుదాఁకాను
॥వేగి॥
సేసినట్టె సేయవే సిగ్గువడక ఆతఁ
డాసపడి నీకు లోనై నదాఁకాను
వేసినట్టె వేయవే వేసరక పాశికలు
బాసయిచ్చి నీకు కిందుపడుదాఁకాను
॥వేగి॥
నవ్వినట్టె నవ్వవే నలువంకలా ఆతఁ
డివ్వల నీకుఁ జన విచ్చుదాఁకాను
రవ్వగ శ్రీవేంకటరాయఁ డీతఁడె కూడె
వువ్విళ్లూరించకువే నిన్ను బ్బించుదాఁకాను
॥వేగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము