Display:
శృంగార సంకీర్తన
రేకు: 610-1
సంపుటము: 14-55
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిజ్జిజి
ముసిముసి నవ్వులతో ముసుఁగులు వెట్టుకొని
పసలుగ మేలుకొని పవ్వళించి వున్నారు
॥పల్లవి॥
సిగ్గులు విడిచినట్టి సీఁటవలపులవారిఁ
కెగ్గులు దప్పులున్నవా యెవ్వరన్నాను
అగ్గమైన సతులు వచ్చి అట్టె కొలువు సేయఁగా
బగ్గన నాపేఁ దానూఁ బవళించి వున్నారు
॥ముసి॥
వెఱపు మఱపు లేని వేడుకకాండ్లకు
మఱఁగు మొఱుఁగున్నదా మాపుదాఁకాను
తఱి మేలుకొలిపే పదము లింతులు వాడఁగ
పఱపై పై నాఁపేఁదాను పవ్వళించివున్నారు
॥ముసి॥
గొంటరులై వుండినట్టి కోడెకాండ్లకు నెల్ల
జంట వాయనున్నదా సారెసారెను
యింటనే శ్రీ వేంకటేశుఁ డీపెఁ గూడి మనముల
బంటులఁ దొత్తులఁ జేసి పవళించి వున్నారు
॥ముసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము