Display:
శృంగార సంకీర్తన
రేకు: 610-2
సంపుటము: 14-56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆందోళి
ఓపను నే నందుకెల్లా నొడ్డుకొంటా నున్నదాన
చేపట్టి నీవు నాచే సేవ గొనవయ్యా
॥పల్లవి॥
పెక్కుమాట లాడించఁగ బెరసి నేనేమందునో
అక్కరతో మన్నించితి వదే చాలు
వెక్కసమై నవ్వించఁగ వెసనెందుకు వచ్చునో
చిక్కులెల్ల వని నాసేవ గొనవయ్యా
॥ఓప॥
తొడపై నిడుకోఁగాను దొమ్మిఁ గాలు దాఁకునేమో
అడరి సేసవెట్టితి వదే చాలు
వొడలు సోఁకించఁగాను వొద్దికై యెట్టుండునో
చిడుముడి నిట్టే నాసేవ గొనవయ్యా
॥ఓప॥
కందువఁ గాఁగిలించఁగ కళ వట్టునో యేమో
అందుక విడెమిచ్చితి వదే చాలు
పొందితి శ్రీ వేంకటేశ బోదించఁగ నదియెట్టో
చిందుఁజెమటల నాచే సేవగొనవయ్యా
॥ఓప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము