అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-5
సంపుటము: 1-59
రేకు: 9-5
సంపుటము: 1-59
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
మదమత్సరము లేక మనసుపేదై పో [1]పదరిన యాసలవాఁడువో వైష్ణవుఁడు | ॥మద॥ |
ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనాఁ జెడనాడి పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు | ॥మద॥ |
గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు | ॥మద॥ |
ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని [2]చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప వావివర్తన గలవాడుఁవో వైష్ణవుఁడు | ॥మద॥ |
[1] ‘వదలిన’ కావచ్చు. అక్షరములు సందిగ్ధముగ నున్నవి.
[2] ‘చావ’ అని రేకు. యతిభంగము.