Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-6
సంపుటము: 1-60
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే
వేదవిరహితులకు వెఱతు మటుగాన
॥ఏది॥
ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గల నిన్నుఁ
బరికించవలెఁగాని భజియింపరాదు
గరిమ చెడి [1]సత్సమాగంబు విడిచిన నీ
స్మరణ విజ్ఞానవాసన గాదుగాన
॥ఏది॥
యిహదేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు
సహజమనవలెఁ గాని సరిఁ గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు
గ్రహియింపరా దవగ్రాహములు గాన
॥ఏది॥
యింతయునుఁ దిరువేంకటేశ నీ వునికిఁ దగఁ
జింతింపవలెఁ గాని సేవింపరాదు
అంతయు [2]ననరుహమును నరుహం బనఁగరాదు
అంతవానికిఁ బరుల కలవడదుగాన
॥ఏది॥

[1] ‘సత్సమాగమము’ అని పూ.ము.పా.

[2] ‘అనర్హ’, ‘అర్హ’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము