అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-2
సంపుటము: 1-62
రేకు: 10-2
సంపుటము: 1-62
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత చదివిన నేమి వినిన తన చింత యేల మాను సిరులేల కలుగు | ॥ఎంత॥ |
ఇతర దూషణములు యెడసినఁ గాక అతికాముకుఁడుగాని యప్పుడు గాక మతి చంచలము గొంత మానినఁ గాక గతి యేల కలుగు దుర్గతులేల మాను | ॥ఎంత॥ |
పరధనముల యాస పాసినఁ గాక అరిది నిందలులేని యప్పుడు గాక విరసవర్తనము విడిచినఁ గాక పరమేల కలుగు నాపదలేల మాను | ॥ఎంత॥ |
వేంకటపతి నాత్మ వెదకినఁ గాక కింక మనసునఁ దొలఁగినఁ గాక బొంకుమాట లెడసిపోయినఁ గాక శంక [1]యాల మాను జయమేల కలుగు | ॥ఎంత॥ |
[1] ‘యేల’ అని పూ.ము.పా.