అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-3
సంపుటము: 1-63
రేకు: 10-3
సంపుటము: 1-63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
కాలవిశేషమో లోకము గతియో సన్మార్గంబుల కీలు వదలె సౌజన్యము కిందయిపోయినది | ॥కాల॥ |
ఇందెక్కడి సంసారం, బేదెసఁ జూచిన ధర్మము కందయినది, విజ్ఞానము కడకుఁ దొలంగినది, గొందులు [1]దరిఁబడె, శాంతము కొంచెంబాయ, వివేకము మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁ బనులు | ॥కాల॥ |
మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన- [2]వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, కొఱమాలెను నిజమంతయు, కొండలకేఁగెను సత్యము, మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి | ॥కాల॥ |
తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు, సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు, తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ- రమణుఁడు గతి దప్పను కల రచనేమియు లేదు | ॥కాల॥ |
[1] ‘దరెఁబడె’ అని రేకు.
[2] ‘నెఱుకలు’ అని పూ.ము.పా. యతిభంగము.