Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-4
సంపుటము: 1-64
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది
పావనుల హృదయమునఁ బ్రభవించుఁ గాని
॥ఈ విశ్వాస॥
ఇమ్మయిన పాపంబు లెన్నివలసినఁ బ్రాణి
సమ్మతంబున జేయఁజాలుఁ గాకేమి
కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును
నమ్మి తలఁచిన విష్ణునామంబుచేత
॥ఈ విశ్వాస॥
కొదలేని దురితములు [1]కొండలునుఁ గోట్లును
చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుఁ గాకేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హృదయంబు హరిమీఁద నుండినంతటను
॥ఈ విశ్వాస॥
సరిలేని దుష్కర్మసంఘములు రాసులై
పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁ గాకేమి
బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను
॥ఈ విశ్వాస॥

[1] ‘కొండలుఁగోట్లును’ అని పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము