Display:
శృంగార సంకీర్తన
రేకు: 694-6
సంపుటము: 14-564
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
చిత్తములోని వలపు చిగురుఁ జేఁగ
యిత్తల వట్టిజాగు లిఁక నేఁటికయ్యా
॥పల్లవి॥
శిరసు వంపులలోనే సిగ్గులు గానిపించె
తరితీపులఁ బొడమె తమకములు
సరిఁ బులకలతోడ సంతోసము లుప్పతిల్లె
తరుణి కాఁగిటికి దగ్గర రావయ్యా
॥చిత్త॥
అల్లార్చి చూచేచూపుల నాసలెల్లాఁ జిమ్మిరేఁగె
పల్లదపు సరసానఁ బైకొనె నవ్వు
వెల్లవిరి సొలపుల వేడుకలు దై వారె
కొల్లలుగా రతులను గూడుదువు రావయ్యా
॥చిత్త॥
తలపోఁతలవల్లఁ దగిలెను మర్మములు
పిలుపులఁ జవులు ముప్పిరిగొనెను
అలరి శ్రీవేంకటేశ అలమేల్మంగకు నీకుఁ
గలిగె కూటములిట్టె గక్కనరావయ్యా
॥చిత్త॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము