Display:
శృంగార సంకీర్తన
రేకు: 695-3
సంపుటము: 14-567
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చెలులాల వినరె యీ చెలువుని సుద్ది నేఁడు
తిలకించి తానే అన్నీఁ దెలుసుకొనుఁ గాక
॥పల్లవి॥
మగువలకు దనకు మరి సాక్షి నన్నడిగీ
తగవులు చెప్పేనా తమకు నేను
మగఁడు తాను వారికి మచ్చిక దేవుళ్లు వారు
సొగిసి వలసినట్టు చూచుకొనుఁ గాక
॥చెలు॥
చేరి తమతమలోనిచేఁతలు నాకుఁ జూపీ
గారవానఁ దమకెల్లా కర్తనా నేను
మేరతో బాసిచ్చెఁ దాను మెలుఁతలు నమ్మినారు
నేరుపుతో నిజములు నిలుపుఁ గాక
॥చెలు॥
గట్టిగాఁ దమవద్దనే కాచుక వుండుమనీ
దట్టమైన అడ్డికపుదాననా నేను
అట్టె శ్రీవేంకటేశుఁడు అలమేలుమంగ నేను
రట్టుగ నన్నేలెఁ దానే చుట్టము గాక
॥చెలు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము