Display:
శృంగార సంకీర్తన
రేకు: 695-4
సంపుటము: 14-568
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
చేరి నీకు వినయాలు సేతుఁ గాక
మేరతో మేలమాడఁగా మితిమీర వచ్చునా
॥పల్లవి॥
వరుసతో నిన్నెంత వలపించ నేర్చినాను
అరసి పంతాలు నే నాడవచ్చునా
దొరఁ జేసి నీవెంత దొడ్డగా మన్నించినాను
పరగ గర్వము నీతోఁ బచారించ వచ్చునా
॥చేరి॥
నెమ్మి నూడిగాలు సేసి నిన్నెంతమెప్పించినాను
చిమ్ములు మందెమేళాలు సేయవచ్చునా
కమ్ముకొని నీవెంత కాఁగిటఁ బెనఁగినాను
యెమ్మెలకు నిన్ను నెలయించ వచ్చునా
॥చేరి॥
కలికినై నిన్నెంత కైవసము చేసుకొన్నా
కెలయుచు నిన్ను జంకించవచ్చునా
అలరి శ్రీవేంకటేశ అలమేల్మంగనే నేను
పలుమారు నీమేను పచ్చిసేయవచ్చునా
॥చేరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము