Display:
శృంగార సంకీర్తన
రేకు: 699-5
సంపుటము: 14-593
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎట్టు వలపించితివో యేమని చెప్పేది నిన్ను
చుట్టమ వన్నిటా నీవు సుదతికి నైతివి
॥పల్లవి॥
చెలువపు నీయెలుఁగు చెవుల విన్నప్పుడే
జల జలఁ జెమరించె సకియ
వెలయ నీపంజుల వెలుఁగు చూచి అంతలో
పులకాంకురాలచేతఁ బొదలుచు నున్నది
॥ఎట్టు॥
ఇప్పుడు నీవు విచ్చేసి యెదుట నుండఁగానే
వుప్పతిల్లు సంసాన నోల లాడీని
నెప్పున మంచముమీఁద నీవు గూచుండితేనే
చిప్పిలుఁ గళలతోడ చిమ్మిరేఁగీని
॥ఎట్టు॥
గక్కననుఁ దన్ను నీవు కాఁగిలించుకొనఁగానే
చొక్కుచుఁ దురుము వీడి సొలసీఁ దాను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితి వీపెను నేఁడు
పిక్కటిల్లుఁ జన్నులను పెనచీ నీమేను
॥ఎట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము