Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-1
సంపుటము: 15-1
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: దేవగాంధారి
అందులకుఁ గాదు నిన్నడిగేది
ముందరి పనులకే మొక్కేఁ గాని
॥పల్లవి॥
సకలలోకములకు స్వామివైన నీవు
వొకని నన్నేల లేక వొల్ల ననేవా
మొకరివై భూమెల్ల మోచి యుండిన నీవు
ఆకట నాపరభారా లాఁప ననేవా
॥అందు॥
పలుజీవులకు నెల్ల ప్రాణమవైన నీవు
వొలసి నాలో నుండ నొల్ల ననేవా
కలిగి బ్రహ్మదులను కనిపెంచిన నీవు
పెలుచనైన నన్నుఁ బెంచ ననేవా
॥అందు॥
వరుస నందరికిని వరదుఁడైన నీవు
యిరవై వరము నాకు నియ్య ననేవా
యెరపు లేక శ్రీ వేంకటేశ నాకు నిహమెల్ల
కరుణతో నిచ్చితివి కడమలు గలవా
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము