Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-5
సంపుటము: 1-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
తన కర్మవశం బించుక, దైవకృతం బొకయించుక,
మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు
॥తన॥
ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు
యీదురవస్థలు గతులును యీలంపటములును
యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి
యీదేహము గలకాలము యెడయవు ప్రాణులకు
॥తన॥
యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు
నీచొక్కులు నీపొక్కులు నీవెడయలుకలును
యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు
నీచిత్తము గలకాలము యెడయవు ప్రాణులకు
॥తన॥
యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు
దైవశిఖామణి తిరుమలదేవుని మన్ననలు
దైవికమున కిటువగవక తన తలఁ పగ్గలమైనను
దైవము తానౌ తానే దైవంబవుఁగాన
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము