అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-6
సంపుటము: 1-66
రేకు: 10-6
సంపుటము: 1-66
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఈ పాదమే కదా యిలనెల్లఁ గొలిచినది యీ పాదమే కదా ఇందిరాహస్తముల కితవైనది | ॥ఈ పాదమే॥ |
ఈ పాదమేకదా ఇందరును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది | ॥ఈ పాదమే॥ |
యీ పాదమే కదా యిభరాజు దలఁచినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది | ॥ఈ పాదమే॥ |
యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది | ॥ఈ పాదమే॥ |