అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-3
సంపుటము: 15-256
రేకు: 45-3
సంపుటము: 15-256
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
ఎక్కడి జాలి యేఁటికి నీకు యెవ్వరివంకా నేమిఁకఁ గలదు తక్కిన వెల్లాఁ దడవక మాని ధర్మమెఱిఁగి బ్రదుకవో మనసా | ॥పల్లవి॥ |
పుట్టినయపుడే తమకర్మములు పొదుగకపోవు జీవుల నెల్లా నెట్టనవిధినిఁ గడచేనంటే నేర్పునఁ బడదు బ్రహ్మకునైనా అట్టిట్టనకా హృదయములోని హరికే శరణు చొచ్చితి నంటే గట్టిగ నతఁడే దిక్కయి నిలిచి కావఁగఁ గలఁడు వెఱవకు మనసా | ॥ఎక్కడి॥ |
సొంపున నీ సంసారంబునకు చొచ్చినయపుడే తగిలెను తొడుసు దింపఁగరాని మోపులు సుమ్మీ తీపులు రేఁచీ సంపద లెల్లా రంపపుటాన దీనికిఁ దోడు రాతిరిఁ బగలు పెట్టని తరవు యింపున గోవిందా యని నొడుగు యితఁడే దయరక్షించును మనసా | ॥ఎక్కడి॥ |
కావలెనని తాఁ గోరినయపుడే కప్పునుమాయ తోయఁగరాదు కేవలమైన వుపమలచేత గెలువఁగరాదు తెలియని చిక్కు ఆవల నేమీఁ దడవఁగ నేలా యఖిలంబునకు నేలికెయైనా శ్రీవేంకటేశుపాదములెపుడూ సేవింపుచునుచెలఁగవో మనసా | ॥ఎక్కడి॥ |