Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-2
సంపుటము: 1-68
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఘోరవిదారణ నారసింహ నీ-
వీ రూపముతో నెట్లుండితివో
॥ఘోర॥
ఉడికెడి కోపపుటూర్పులఁ గొండలు
పొడివొడియై నభమున కెగయ
బెడిదపు రవమున పిడుగులు దొరుగఁగ
యెడనెడ నీవపు డెట్లుండితివో
॥ఘోర॥
కాలానలములు గక్కుచు నయన-
జ్వాలల నిప్పులు చల్లుచును
భాలాక్షముతో బ్రహ్మాండకోట్ల-
కేలికవై నీవెట్లుం[1]డితివో
॥ఘోర॥
గుటగుటరవములు కుత్తికఁ గులుకుచు
గిటగిటఁ బండ్లు గీఁటుచును
తటతటఁ బెదవులు దవడలు వణఁకఁగ
ఇటువలె నీవపుడెట్లుండితివో
॥ఘోర॥
గోళ్ళ మెఱుఁగుల కొంకుల పెదపెద-
వేళ్ళ దిక్కులు వెదకుచును
నీళ్ళతీగెలు [2]నిగుడఁగ [3]నోర ను-
చ్చిళ్ళు [4]గమ్మఁగ నెట్లుండితివో
॥ఘోర॥
హిరణ్యకశిపుని నేపడఁచి భయం-
కరరూపముతోఁ గడుమెరసి
తిరువేంకటగిరిదేవుఁడ [5]నీవిఁక
యిరవుకొన్న నాఁడెట్లుండితివో
॥ఘోర॥

[1] నిడురేకు 11లోని పాఠము- నాఁడెట్లుండి.

[2] నిడురేకు 11లోని పాఠము- నిగిడి.

[3] నిడురేకు 11లోని పాఠము- నోర.

[4] నిడురేకు 11లోని పాఠము- గారఁగ.

[5] నిడురేకు 11లోని పాఠము- డవై యిందిరవుకొంటి.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము