అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-3
సంపుటము: 1-69
రేకు: 11-3
సంపుటము: 1-69
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
నేల మిన్ను నొక్కటైన నీబంటు వొక్క- వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు | ॥నేల॥ |
ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ నింగికిఁ జెయిచాఁచె నీబంటు [1]చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు | ॥నేల॥ |
వెట్టగా రావణు రొమ్ము విరుగఁ జేతనే గుద్దె నిట్టతాడువంటివాఁడు నీబంటు దిట్టయై మందులకొండ తేజమున నడురేయి పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు | ॥నేల॥ |
అలర నన్నియుఁ జేసి అజుని పట్టానకు నిలుచున్నాఁ డదివో నీబంటు బలువేంకటేశ ఈ [2]పవననందనుఁడు కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు | ॥నేల॥ |
[1] ‘చంగన’ అని రేకు.
[2] పెదరేకు 2 పాఠము- నీపవన.