Display:
శృంగార సంకీర్తన
రేకు: 703-1
సంపుటము: 16-13
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
నిన్నుఁ జూచి వేడుకాయ నేఁడు మాకెల్లాను
పన్నిన నీ కోరికలు ఫలియించె నిపుడు
॥పల్లవి॥
జవ్వనమదముతోడ సతి నీవద్దఁ గూచుండి
నవ్వులు నవ్వఁగా నీకు నాటె మోహము
వువ్విళ్లూర నాపె నిన్ను వడి వట్టి తియ్యఁగాను
నివ్వటిల్లుఁజెమటలు నిలువెల్లా నిండెను
॥నిన్ను॥
కులుకుఁజన్నులతోడ కొమ్మ నిన్నుఁ గొరుచు
పలుకఁగా నీమర్మాలు పచ్చి దేరెను
మొలకసిగ్గులతోడ ముంచి నిన్నాపె చూడఁగా
కళలెల్లా నీమోమును కారు కమ్మెను
॥నిన్ను॥
కామిని నిన్నేకతానఁగాఁగిలించుకొనఁ గాను
దోమటి మెయిఁ బులకలు తొట్టుకొనెను
కామించి శ్రీ వేంకటేశ కలికి నిన్నుఁగూడఁగ
నీమనసులో వలపు నిండుకొనెను
॥నిన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము