Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-4
సంపుటము: 1-70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
దెలియుట దనలోఁ దెలియుట కొరకే
॥తలఁచిన॥
ఉదయమందుట భవముడుగుట కొరకే
చదువుట మేలు విచారించు కొరకే
బ్రదుకుట పురుషార్థపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే
॥తలఁచిన॥
తగులుట విడివడఁదలఁచుట కొరకే
నొగులుట కర్మమనుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే
॥తలఁచిన॥
యీవలఁ జేయుట ఆవలి కొరకే
ఆవల నుండుట యీవలఁ కొరకే
యీవల నావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే
॥తలఁచిన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము