అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-1
సంపుటము: 1-72
రేకు: 12-1
సంపుటము: 1-72
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
పరదేశిపట్టణమున పదుగురు నేగురుఁ గూడుక పరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ | ॥పరదేశి॥ |
ఊరేలెడి యతఁ డలసత నూరకయుండఁగ నడుముల వారలు నిక్కపుగర్తలవలె నుండిన గతిని ధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక [1]యుండిన ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ | ॥పరదేశి॥ |
వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమున తడఁబడు [2]విజ్ఞానము గతి దప్పఁగ బలుపగు పట్నము కడుఁ జెడఁగా మాలవాడ ఘనమైనట్లాయ | ॥పరదేశి॥ |
పొసఁగఁగ నిది గని యధికుడు [3]పుక్కటకాండ్ల నందరిఁ బసమారిచి [4]మొదలికర్తఁ బాలించిన గతిని పసగల తిరువేంకటగిరిపతి నాదేహపుఁ బురి నీ- వసమై వెన్న(న్ను?)కు బండ్లు వచ్చినయట్లాయ | ॥పరదేశి॥ |
[1] నిడురేకు 86- యుండఁగ.
[2] ‘విగ్ఞానము’ అని రేకు.
[3] నిడురేకు 86- వుక్కటి.
[4] నిడురేకు 86- మాలిచి.