Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-2
సంపుటము: 1-73
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
పోరొ పోరొ యమ్మలాల బొమ్మలాటవారము
యీరసాన మమ్ము నిట్టే యేమి సేసేరు
॥పోరొ॥
ఊరులేని పొలమేర వొడలు మోచుకొని నేము
తేరదేహ మెక్కుకొని తిరిగేము
వారువీరనుచు వట్టివావులు సేసుక లేని
పేరు పెట్టుకొని లోలోఁ బిరువీకులయ్యేము
॥పోరొ॥
బుద్దిలేని బుద్దితోడ పొందు సేసుకొని వట్టి-
యెద్దుబండికంటి [1]సంది నీఁగేము
నిద్దురలో తెలివంటా నీడలోని [2]యెండంటా
వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము
॥పోరొ॥
మాటులేని మాటు దెచ్చి మరఁగు వెట్టుక వట్టి
మేటానమేట్లవలె మెరసేము
గాటమైన తిరువేంకటగిరినిలయుని
నాటకమే నిజమని నమ్మిక నున్నారము
॥పోరొ॥

[1] ‘సంది’ ఇది పూ.ము.న తప్పినది. రేకులో నున్నది.

[2] ‘యండ’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము