Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-3
సంపుటము: 1-74
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఎవ్వఁడో కాని యెరఁగరాదు [1]కడు-
దవ్వులనే వుండు తలంపులోనుండు
॥ఎవ్వఁడో॥
[2]ఎడయవు తన రెక్క లెగసిపోలేఁడు
కడు దాఁగుఁ గాని దొంగయుఁ గాడు
వడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడు
వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు
॥ఎవ్వఁడో॥
మిగులాఁ బొట్టివాఁడు మింటికినిఁ బొడవు
జగడాలు తపసివేషములును
మగువకై పోరాడు మరి విరక్తుఁడును
తగుఁ గాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము
॥ఎవ్వఁడో॥
తరుణుల వలపించు తగిలి పై కొనఁడు
తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు
తిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడును
పరమమూర్తియై పరగు నీఘనుడు
॥ఎవ్వఁడో॥

[1] నిడురేకు 43 - కడుఁగడు.

[2] ఇందు దశావతారసమన్వయము కలదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము