Display:
శృంగార సంకీర్తన
రేకు: 789-7
సంపుటము: 16-528
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
ఏమయ్యా వూరక చూచే వెత్తి కాఁగిలించుకోక
ఆముకొన్న యాసోదాన నలయుచునున్నది
॥పల్లవి॥
చిత్తము నీపైఁ బెట్టి సిగ్గుతోఁ దాఁ దలవంచి
హత్తి వూడిగలు సేసీ నదివో చెలి
బత్తినీపైఁ బెట్టుకొని పాదాలు వాసుకుంటా
కొత్తవలపులతోడ గుబ్బతిలీని
॥ఏమ॥
పాయము నీ కప్పగించి పాపట దువ్వుకొంటా
పాయక కొలువులోన భావించీఁ జెలి
దోయఁడుచేతుల మొక్కి తఁగుఁజెమటలతోడ
సోయగపుఁ జూపులఁ జూచి చొక్కీని
॥ఏమ॥
తాళి నీకుఁగాఁ గట్టి తనలోనే గుట్టుతోడ
తాలిమితమకమున దైవారీఁ జెలి
యీలీల శ్రీవేంకటేశ ఇంతలో నీవు గూడఁగ
మేలిమి సంతోసాన మించి చెలఁగీని
॥ఏమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము