శృంగార సంకీర్తన
రేకు: 1-1
సంపుటము: 17-1
రేకు: 1-1
సంపుటము: 17-1
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: సాళంగనాట
ఎటువంటి మోహమో యింతి నీపై నతనికి తటుకన నురమున ధరియించె నిన్నును | ॥పల్లవి॥ |
కామిని నీ నడపులు గజగమనము లని కామించి నీ పతి కరిఁ గాచెను కోమలపు నీ పిరుఁదు చక్రభావ మని నేమమై చక్రము చేత నిలిపినాఁ డతఁడు | ॥ఎటు॥ |
నెలఁత నీ నిలయము నీరజ మనుచుఁ బ్రియ మలరి జలజనాభుఁ డాయ నతఁడు కలికి నీ గళము శంఖముఁ బోలునని తాఁ దలఁచి పాంచజన్యధరుఁ డాయ నతఁడు | ॥ఎటు॥ |
నిరతి నలమేల్మంగ నీ కురులు నలు పని అరుదార నీలవర్ణుఁ డాయ నతఁడు గిరికుచవని నిన్నుఁ గెరలి కౌఁగిటఁ గూడె పరగ శ్రీ వేంకటపతి యాయ నతఁడు | ॥ఎటు॥ |