Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 12-4
సంపుటము: 1-75
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు
॥నిత్యాత్ము॥
ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁజాలెడునాతఁ-
డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు
యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాత్ముఁ డేమూర్తి పరమాత్ముఁ-
డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు
॥నిత్యాత్ము॥
యేదేవు దేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున [1]నిన్నియును నణఁగె మరి
యేదేవు విగ్రహం బీసకల మింతయును
యేదేవు నేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ [2]డద్వంద్వుఁ-
డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
॥నిత్యాత్ము॥
[2]యేవేల్పు పాదయుగ మిలయు నాకాశంబు
యేవేల్పు పాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము
యేవేల్పు నిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ-
డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు
॥నిత్యాత్ము॥

[1] పెద్దరేకు2 - మేనిలో.

[2] అద్వంద్యు అని రేకు.

[3] ఈ మూడవచరణంలో ఒకటి మూడు పాదముల మధ్యమున నిలువుగీత యున్నది. ఆ దోషము పూ.ము.న పరిష్కరించబడినది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము