Display:
శృంగార సంకీర్తన
రేకు: 31-6
సంపుటము: 17-187
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: మేఁచబౌళి
తనకే తెలుసుఁ గాక తఱవాతి పను లెలా
చనవు మనవు లింకా సారెఁ జెప్ప నేఁటికే
॥పల్లవి॥
చెవి కింపుగానిమాట చిందరగొనేటిపాట
చవిగాని జాగరాలు సరియాఁకలు
ఆవలిమోమైన నవ్వు అడవిఁగాసే వెన్నెల
తనివి యాతని నెంతదడవు సాదించేనే
॥తనకే॥
అందీనందనిబొందులు ఆమనికాలపుఁ బొల్ల
చెంది యుండని రతి చిత్తరువ్రాఁత
సందడిలో సరసము జలదిలోపలివాన
యిందుకై రమణుని యాలే దూరను
॥తనకే॥
తనివోనితమకము తవ్వక కన్నధనము
కినయని వలపు తంగేటిజున్ను
యెనసి శ్రీవేంకటేశుఁడే యిప్పుడే నన్ను
మన సొక్కటాయను మచ్చిక లీడేరెనే
॥తనకే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము