Display:
శృంగార సంకీర్తన
రేకు: 32-3
సంపుటము: 17-190
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: కేదారగౌళ
ఈరీతి రతి గొనెను యింతికి నీపై వలపు
యేరీతిఁ బొద్దు గడపు నింటికి రావయ్యా
॥పల్లవి॥
చిత్తరువు వ్రాయఁ బోతే చెలియకు నంతలోనే
హత్తి నీ రూపే తొరలీ హస్తములకు
మత్తిలి యెవ్వరితోడ మాటాడఁబూనినాను
బత్తితో నీ పేరే వచ్చీ పరగ నోరికిని
॥ఈరీతి॥
ఆలకించి వింటేను అన్నియు నీ పలుకులై
వేల సంఖ్యలై తోఁచీ వీనులకు
తాలిమి నిట్టూరుపు మొత్తములఁ జెలఁగితేను
మేలిమినీ వాసనే మెఱసీ ముక్కునను
॥ఈరీతి॥
పక్కన శ్రీవేంకటేశ బయలు కౌఁగిలించితే
అక్కున నీవే నిలిచే వంగములకు
యిక్కువలఁ దలపోసి యెటువలె భావించినా
మక్కువలై చవి వుట్టే మనసు నాకు
॥ఈరీతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము