Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-1
సంపుటము: 1-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
ఏఁటివిజ్ఞాన[1] మేఁటిచదువు
గూఁటఁబడి వెడలుగతి గురుతు గనలేఁడు
॥ఏఁటి॥
ఏడుమడుకల చర్మ మింతయునుఁ దూంట్లై[2]
గాడఁబెట్టుచుఁ జీము గారఁగాను
పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి[3]
వీడఁదన్నుక చనెడి వెరవు గనలేఁడు
॥ఏఁటి॥
కడుపు నిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు [4]సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁ డోపననలేఁడు
॥ఏఁటి॥
వుదకమయమగు కన్ను లురికి యేమైనఁ గని
మదవికారము మతికి మరుపఁగాను
యిది యెరిఁగి తిరువేంకటేశుఁ గని జీవుఁడా-
సదమలానందంబు చవి గానలేఁడు
॥ఏఁటి॥

[1] నిడురేకు 4- సుజ్ఞాన.

[2] నిడురేకు 4- దూంట్లను.

[3] నిడురేకు 4- దేహంబు బ్రదుకఁ గోరీఁ గాని.

[4] ‘సుఖము యిందు’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము