Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-2
సంపుటము: 2-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నియు
పైపై నీశరణమే పరమపదంబు
॥పల్లవి॥
పరమాత్మునిపై నాత్మ ప్రవేశింపఁజేయుటే
పరికింపఁ బరకాయప్రవేశము
గరిమ నాహృదయాకాశమునఁ దలఁచుటే
గిరవై యబ్బినయట్టి ఖేచరత్వము
॥శ్రీప॥
మంచి పరమహంసనామము ప్రాణులచే వింట
చంచుల వినేటి దూరశ్రవణము
కాంచి నీరూపము ఆరుకమలాల ధ్యానించుట
యెంచఁగ దూరగమన మింటిలో నౌట
॥శ్రీప॥
సావధానమె లోచూపు సర్వథా నిన్నుఁ జూచుట
తావులనే అనిమిషత్వము చేరుట
శ్రీవేంకటేశ్వర నీసేవకుఁడై నిలుచుటే
వేవేలు తత్త్వజ్ఞానవిధుల నిలుచుట
॥శ్రీప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము