Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 155-4
సంపుటము: 2-260
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
ధరణి నెంద రెన్నితపములు చేసినాను
హరికృపగలవాఁడే అన్నిటాఁ బూజ్యుఁడు
॥పల్లవి॥
మితిలేని విత్తు లెన్ని మేదినిపైఁ జల్లినాను
తతితో విత్తినవే తగఁ బండును
యితరకాంతలు మఱి యెందరు గలిగినాను
పతి మన్నించినదే పట్టపుదేవులు
॥ధర॥
పాలుపడి నరు లెన్నిపాట్లఁ బడి కొలిచినా-
నేలికె చేపట్టనవాఁడె యెక్కుడుబంటు
మూల నెంతధనమున్నా ముంచి దానధర్మములు
తాలిమితో నిచ్చినదే దాఁపురమై నిల్చును
॥ధర॥
యెన్నికెకుఁ గొడుకులు యెందరు గలిగినాను
యిన్నిటా ధర్మపరుఁడే యీడేరును
వున్నతిఁ జదువులెన్ని వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే సతమై ఫలించును
॥ధర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము