అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-2
సంపుటము: 1-78
రేకు: 13-2
సంపుటము: 1-78
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అతిదుష్టుఁడ నే నలసుఁడను యితర వివేకం బిఁక నేది | ॥అతి॥ |
ఎక్కడ [1]నెన్నిట యేమి సేసితినొ నిక్కపుఁ దప్పులు నేరములు గక్కన నిన్నిట కలిగిన నీవే దిక్కుగాక మరి దిక్కేది | ॥అతి॥ |
ఘోరపుఁ బాపము కోట్ల సంఖ్యలు చేరువ నివె నా చేసినవి నీరసునకు నిటు నీకృప నాకిఁక కూరిమి నా [2]యెడ గుణమేది | ॥అతి॥ |
యెఱిఁగి చేసినది యెఱఁగక చేసిన కొఱతలు నా [3]యెడఁ గోటు లివే వెఱపు దీర్చి శ్రీవేంకటేశ[4] కావు మఱవక నాగతి మరి యేది | ॥అతి॥ |
[1] ‘నిన్నిట’ అని రేకు.
[2][3] ‘యడ’ అని రేకు.
[4] నిడురేకు 29- వేంకట కావుము.