అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-3
సంపుటము: 1-79
రేకు: 13-3
సంపుటము: 1-79
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
దైవకృతంబట చేఁతట తన కర్మాధీనంబట కావలసిన సౌఖ్యంబులు గలుగక మానీనా | ॥దైవ॥ |
ఎక్కడి దుఃఖపరంపర లెక్కడి సంసారంబులు యెక్కడి జన్మము ప్రాణులకేలా కలిగినది యెక్కడి మోహవిడంబన యెక్కడి యాశాబద్ధ(ంధ?)ము యెక్కడి కెక్కడ నిజమై యివి దానుండీనా | ॥దైవ॥ |
యీకాంతలు నీద్రవ్యము లీకన్నుల వెడయాసలు యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా | ॥దైవ॥ |
దేవశిఖామణి తిరుమలదేవుని కృపగల చిత్తము పావనమై దురితంబులఁ బాయక మానీనా ఆవిభు కరుణారసమున నతఁడే తను మన్నించిన ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా | ॥దైవ॥ |