Display:
శృంగార సంకీర్తన
రేకు: 86-3
సంపుటము: 17-457
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
తగులువిరి మోహాల దాయగాఁడా
చిగురుఁ జెక్కిటివిూఁది చేయాల నీకును
॥పల్లవి॥
చూచితిమో చూడనో సొలసి ని న్నొకమాటు
యేచి నన్నుఁ గొంగువట్టే విదేరా నీవు
ఆచాయ నీపేరిటి దంటినో అననో
వాచవిమాటలకే వలచేవు నాకును
॥తగులు॥
సెలవివెన్నెలనవ్వు చిందితినో చిందనో
పలుమారు సరసాలే పచరించేవు
నిలిచితినో నిలువనో నీ యెదుట నిటువచ్చి
కలవి లేనివి గొన్ని కాఁకలు చల్లేవు
॥తగులు॥
మూవంకల దొరవంటా మొక్కితినో మొక్కనో నీ
దేవులవు గమ్మంటా దీవించేవు
ఆవేళ శ్రీవేంకటేశ అలమేలుమంగ నంటే
వావిగూడె నని నన్ను వన్నెగాఁ గూడితివి
॥తగులు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము