Display:
శృంగార సంకీర్తన
రేకు: 90-6
సంపుటము: 17-484
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ఆహిరి
ఎందుకైనా నిచ్చగించీ నిదె విభుఁడు
అంది ప్రియములు చెప్పినట్టిరా వలపా
॥పల్లవి॥
తీపులమాటలఁ దిట్టేతెఱవఁ దప్పక చూచి
ఆపలేక మోవి నీ నదే విభుడు
యీపొద్దు దాఁకా రావంటా నింతి గోపగించుకొంటే
పైపైనే కౌఁగిలించెను బాపురే వలపా
॥ఎందు॥
కలికిగద్దెపై నుండి కడు సుద్దు లడుగఁగ
నిలుచుండే నవ్వు నవ్వీ నేఁడుఁవిభుఁడు
అలుకలే పచరించి యానలు వెట్టుకోఁబోఁగా
మెలుపున నోరు మూసి మేలు మేలు వలపా
॥ఎందు॥
అపుడే దయదలఁచి అంగన దగ్గరి రాఁగా
కప్పెఁ బచ్చడము శ్రీవేంకటవిభుఁడు
చెప్పరాని రతిఁ గూడి చెమరించేసతి కీత
డప్పటి విసరఁ జొచ్చె నయ్యా వలపా
॥ఎందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము