అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-4
సంపుటము: 1-80
రేకు: 13-4
సంపుటము: 1-80
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం[1]
ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ డచలుఁ డనంతుం [2]డమలుఁడు ఆదేవుఁ డీతఁడేపో హరి వేంకటవిభుఁడు | ॥ఆదిమ॥ |
ఏకార్ణవమై ఉదకము లేచిన బ్రహ్మాండములోఁ బైకొని యుండఁగ నొక వటపత్రములోపలను చేకొని పవళింపుచు నొక శిశువై వడిఁ దేలాడిన శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు | ॥ఆదిమ॥ |
అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపము సరగున భూమంతయు నొక చరణంబున గొలచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు | ॥ఆదిమ॥ |
క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా ధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగను[3] చేరువఁ దను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి[4] నారాయణుఁ డీతఁడే వున్నత వేంకటవిభుఁడు | ॥ఆదిమ॥ |
[1] పెద్దరేకులో దీని రాగము సామంతము.
[2] ‘అనంతుఁ డమలుఁడు’ అని రేకు.
[3] నిడురేకు 11- పాదంబులు గుద్దగను.
[4] నిడురేకు 11- వెలుఁగొందెడి.