Display:
శృంగార సంకీర్తన
రేకు: 827-2
సంపుటము: 18-158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఏమని చెప్పుదునే మీకింతులాల
చే ముంచి నాకు వలపు చిమ్మిరేఁచె నతఁడు
॥పల్లవి॥
మలసి నాపతిరూపు మతి నెంతదలఁచినా
తలపోఁతనే కాని తమివోదు
కలలోన నెటువలెఁ గాఁగిలించుకొనినాను
వెలినున్న మేనిమీఁదివిరహము దీరదు
॥॥
యేలినవానిగుణాలు యెంత వీనుల వినినా
ఆలకింపులే కాని ఆసలు వోవు
పాలుపడి యాతఁడుఁ డే పానుపుపైఁ బడినాను
తాలిమితో నావేడుక తనివొందదు
॥॥
ముంగిటఁ దనరాకకు మొగమెత్తు కుండినాను
తొంగిచూపులే కాని తుందుడుకు వోదు
చెంగట నంతలో వచ్చి శ్రీవేంకటేశుఁ డె కూడె
కుంగనినాసంతోసము గురుతువెట్టరాదు
॥॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము