Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 13-6
సంపుటము: 1-82
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
పాపములే సంబళమెపుడూ యీ-
యాపదఁ బడి నే నలసేనా
॥పాపములే॥
ఎన్నిపురాణము లెటువలె విన్నా
మన్న మనువు దిమ్మరితనమే
నన్ను నేనే కానఁగలేనట నా
విన్న వినుకులకు వెఱచేనా
॥పాపములే॥
యెందరు వెద్దల నెట్లఁ గొలిచినా
నిందల నా మతి నిలిచీనా
కందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనట
అందపుఁ బరమిఁక నందేనా
॥పాపములే॥
తిరువేంకటగిరిదేవుఁడే పరమని
దరి గని తెలి విఁక దాఁగీనా
తిరముగ నినుఁ జింతించిన చింతే
నిరతము ముక్తికి నిధిగాదా
॥పాపములే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము